Street Style Paneer Samosa : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే వాటిలో సమోసాలు కూడా ఒకటి. సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనకు వివిధ రుచుల్లో ఈ సమోసాలు లభిస్తూ ఉంటాయి. వాటిలో పనీర్ సమోసా కూడా ఒకటి. పనీర్ సమోసా చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ సమోసాను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా పనీర్ తో సమోసాలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పనీర్ సమోసాలను స్ట్రీట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రీట్ స్టైల్ పనీర్ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ -1, చిన్నగా తరిగిన పెద్ద క్యాప్సికం – 1, ఉప్పు – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అటుకులు – పిడికెడు, సమోసా స్ట్రిప్స్ – తగినన్ని, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్.
పనీర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిలికిన పెరుగు – అర కప్పు, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వేయించిన జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పనీర్ – 200 గ్రా..
స్ట్రీట్ స్టైల్ పనీర్ సమోసా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పనీర్ తప్ప మిగిలిన పదార్థాలను తీసుకుని బాగా కలపాలి. తరువాత పనీర్ ను స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. పనీర్ కు ఈ మిశ్రమం పట్టేలా కలుపుకుని అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత గ్రిల్ చేసే ప్యాన్ ను తీసుకుని దానిపై నూనె వేసుకోవాలి. తరువాత పనీర్ వేసి వేయించాలి. పనీర్ ను అన్ని వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిని ముక్కలుగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత క్యాప్సికం తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత చాట్ మసాలా, గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత అటుకులు వేసి కలిపి ఈ మిశ్రమం చల్లారే వరకు అలాగే ఉంచాలి.
ఈ మిశ్రమం చల్లారిన తరువాత కట్ చేసుకున్న పనీర్ వేసి కలపాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని తగినన్నినీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి పక్కకు ఉంచాలి. తరువాత సమోసా స్ట్రిప్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుని సమోసా ఆకారంలో చుట్టుకోవాలి. తరువాత ఇందులో నిండుగా పనీర్ మిశ్రమాన్ని ఉంచి అంచులకు మైదాపిండి పేస్ట్ ను రాసి అంచులను మూసి వేయాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో డీప్ ఫ్రైకు నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సమోసాలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ సమోసాలు తయారవుతాయి. వీటిని వేయించిన మిర్చి, టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.