Sunni Sangati : సున్ని సంగటి.. మినుములతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు తయారు చేసి పెడుతూ ఉంటారు. దీనిని తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పి, నీరసం తగ్గుతుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు, స్త్రీలు దీనిని తప్పకుండా తయారు చేసుకుని తినాలి. ఈ సున్ని సంగటిని తయారుచేయడం చాలా సులభం. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ సున్ని సంగటిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సున్ని సంగటి తయారీకి కావల్సిన పదార్థాలు..
మినుములు – అర కప్పు, పాలిష్ చేయని బియ్యం – అర కప్పు, తాటి బెల్లం – ఒకకప్పు, నీళ్లు – రెండు కప్పులు, ఉప్పు – చిటికెడు, నువ్వుల నూనె – అర కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
సున్ని సంగటి తయారీ విధానం..
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తరువాత బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టాలి. ఒక కళాయిలో మినుములు వేసి చిన్న మంటపై వేయించాలి. మినుములు చక్కగా వేగి మంచి వాసన వచ్చిన తరువాత గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత అదే కళాయిలో బియ్యాన్ని కూడా వేసి వేయించాలి. బియ్యం చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే మినపప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి మరలా కళాయిలోకి తీసుకోవాలి.
బెల్లం నీళ్లు మరిగిన తరువాత ఉప్పు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడిని ఒక్క చేత్తో వేస్తూ మరో చేత్తో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తరువాత నువ్వుల నూనెను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా నూనంత వేసిన తరువాత ఈ మిశ్రమం బాగా ఉడికి నూనె పైకి తేలుతుంది. ఇలా నూనె పైకి తేలగానే యాలకుల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సున్ని సంగటి తయారవుతుంది. దీనిని చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.