Tasty Tea : మనలో చాలా మంది రోజూ టీ ని తాగుతూ ఉంటారు. కొందరికి టీ తాగనిదే రోజూ గడవదని చెప్పవచ్చు. ఈ టీ ని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. తరచూ ఒకేరకం టీ కాకుండా కింద చెప్పిన విధంగా చేసే టీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ టీని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే స్టైల్ టీ కావాలంటారు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇలా టీ ని తయారు చేసి ఇస్తే అందరూ మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటారని చెప్పవచ్చు. అందరికి నచ్చేలా మరింత రుచిగా టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టేస్టీ టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – 4 కప్పులు, నీళ్లు – ఒక కప్పు, టీ పొడి – 4 టీ స్పూన్స్, బెల్లం – ఒక చిన్న ముక్క, ఎండు గులాబి రేకులు – 10, పంచదార – తగినంత, పాల పొడి – 3 టీ స్పూన్స్.
టేస్టీ టీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు పొంగి ఒక పొంగు వచ్చిన తరువాత మంటను చిన్న చేసి వాటిని మరిగిస్తూ ఉండాలి. ఇప్పుడు మరో గిన్నెలో నీళ్లు, టీ పొడి,బెల్లం, గులాబి రేకులు, పంచదార వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత మరుగుతున్న పాలను పోసి కలపాలి. తరువాత గంటెతో టీని తీసుకుని పై నుండికిందికి పోస్తూ మరిగించాలి. టీ మరిగి చక్కటి రంగు వచ్చిన తరువాత పాల పొడి వేసి కలపాలి. ఈ టీ ని మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ టీని వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టీ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన టీని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారని చెప్పవచ్చు.