Tawa Paneer : మనకు ధాబాల్లో, రెస్టారెంట్ లలో లభించే పనీర్ వెరైటీలల్లో తవా పనీర్ కూడా ఒకటి. తవా పనీర్ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే స్టాటర్ గా తీసుకోవడానికి కూడా ఇది చక్కగా ఉంటుంది. చాలా మంది ఈ తవా పనీర్ ను ఇష్టంగా తింటారు. జ్యూసీగా, రుచిగా ఉండే ఈ తవా పనీర్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభం. ఇంట్లో పార్టీస్ జరిగినప్పుడు, వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా పనీర్ తో వెరైటీగా తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లో పనీర్ ఉంటే చాలు అరగంటలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే తవా పనీర్ ను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తవా పనీర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – 1/3 కప్పు, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, క్యూబ్స్ లాగా తరిగిన పనీర్ – 200 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన క్యాప్సికం – 1, చిన్నగా తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్.
తవా పనీర్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో కారం, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత పనీర్ వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద తవాన్ని ఉంచి వేడి చేయాలి. దీనిపై నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత క్యాప్సికం, టమాట ముక్కలు వేసి వేయించాలి. ముక్కలు బాగా వేసి నూనె పైకి తేలిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత పనీర్ వేసి మంటను మధ్యస్థంగా చేసి వేయించాలి. దీనిని కలుపుతూ 4 నుండి 5 నిమిషాల పాటు వేయించిన తరువాత కసూరి మెంతి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తవా పనీర్ తయారవుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన తవా పనీర్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.