Telagapindi Kobbarikura : తెలగపిండిని సాధారణంగా పశువులకు పెడుతుంటారు. కానీ దీన్ని మనం కూడా తినవచ్చు. కాకపోతే పశువులకు పెట్టేది.. మనం తినేది కాస్త శుద్ధి చేయబడి ఉంటుంది. అయితే తెలగపిండిని తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం. దీన్ని నేరుగా తినలేకపోతే ఇతర పదార్థాలతో కలిపి వండి తినవచ్చు. ముఖ్యంగా తెలగపిండిని కొబ్బరితో కలిపి వండి తింటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. తెలగపిండి కొబ్బరి కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలగపిండి కొబ్బరి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తెలగపిండి – ఒక కప్పు, కొబ్బరి – పావు కప్పు, నీళ్లు – కప్పున్నర, నూనె – మూడు టీస్పూన్లు, మెంతులు – చిటికెడు, బెల్లం – చిన్న ముక్క, కారం – అర టీస్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు కోసం కావల్సిన పదార్థాలు..
కరివేపాకు – ఒక రెబ్బ, వెల్లుల్లి రెబ్బలు – 8, ఆవాలు, జీలకర్ర – పావు టీస్పూన్ చొప్పున, మినప పప్పు – ఒక టీస్పూనున్నర, ఎండు మిర్చి – 3.
తెలగపిండి కొబ్బరి కూరను తయారు చేసే విధానం..
నీళ్లను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో మెంతులు, బెల్లం ముక్క, కారం, ఉప్పు వేసి మరగనివ్వాలి. బాగా మరిగిన నీళ్లలో తెలగపిండి, కొబ్బరి వేసి ఉండ కట్టకుండా కలపాలి. దాన్ని చిన్న మంట మీద ఉంచి పొడి పొడిగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. మరో పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసి తాళింపు కోసం తీసి పెట్టుకున్న పదార్థాలతో పోపు వేయాలి. ఉడికిన తెలగపిండి కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసి కలిపి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. తరువాత దింపి వేడి వేడిగా అన్నంలో కలుపుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.