Thamalapaku Kobbari Laddu : మనం కొబ్బరి లడ్డూలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. బెల్లం, కొబ్బరి కలిపి చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని తరుచూ తయారు చేస్తూ ఉంటారు. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ కొబ్బరి లడ్డూలను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. తమలపాకు వేసి ఈ లడ్డూలను మనం మరింత, కమ్మగా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలను ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. ఎంతో కమ్మగా, రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే ఈ తమలపాకు కొబ్బరి లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తమలపాకు కొబ్బరి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత తమలపాకులు – 4, బెల్లం తరుగు – 200 గ్రా., నీళ్లు – 75 ఎమ్ ఎల్, పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, గుల్ కంద్ – 2 టేబుల్ స్పూన్స్.
తమలపాకు కొబ్బరి లడ్డూ తయారీ విధానం..
ముందుగా లేత తమలపాకులను వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి తీగపాకం వచ్చే వరకు కలుపుతూ ఉడికించాలి. బెల్లం తీగపాకం రాగానే మంటను చిన్నగా చేసి అందులో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, గుల్ కంద్ వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. తరువాత కట్ చేసుకున్న తమలపాకు ముక్కలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. తరువాత ఈ లడ్డూలను ఎండు కొబ్బరి పొడితో కోటింగ్ చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తమలపాకు లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలు 3 నుండి 4 రోజుల పాటు తాజాగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.