Thatibellam Coffee : మనలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ద రావడంతో పంచదారకు బదులుగా తాటిబెల్లాన్ని వాడుతున్నారు. తాటిబెల్లం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో, శరీరంలో వేడిని పెంచడంలో అనేక విధాలుగా తాటిబెల్లం మనకు సహాయపడుతుంది. తాటిబెల్లం వాడకం కూడా ఈ మధ్య కాలంలో పెరిగిందని చెప్పవచ్చు. తీపి వంటకాలతో పాటు కాఫీ, టీ వంటి వాటిలో కూడా తాటిబెల్లాన్ని వాడుతున్నారు. తాటిబెల్లాన్ని వాడినప్పటికి చాలా మందికి దీనితో కాఫీ చేసుకోవడం రావడం లేదనే చెప్పవచ్చు. తాటిబెల్లం వేయడం వల్ల పాలు విరిగిపోతాయి. ఇది చాలా మందికి జరిగే ఉంటుంది. కానీ చాలా సులభంగా మనం పాలు విరగకుండా తాటిబెల్లంతో కాఫీని తయారు చేసుకోవచ్చు. ఈ కాఫీని తయారు చేయడం చాలా సులభం. పాలు విరగకుండా తాటిబెల్లంతో కాఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తాటిబెల్లం కాఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక కప్పు, తాటిబెల్లం – రుచికి తగినంత, లో ఫ్యాట్ మిల్క్ – పావు లీటర్, కాఫీ పౌడర్ – తగినంత.
తాటిబెల్లం కాఫీ తయారీ విధానం..
ముందుగా తాటి బెల్లాన్ని ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని పోసి అందులో తాటి బెల్లాన్ని వేసి వేడి చేయాలి. తాటి బెల్లం కరుగుతుండగానే మరో గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. తాటి బెల్లం కరిగిన తరువాత కాఫీపౌడర్ వేసి కలపాలి. దీనిని మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. డికాషస్ కొద్దిగా చల్లారిన తరువాత ఒక గ్లాస్ పావు వంతు డికాషన్ ను తీసుకోవాలి. తరువాత పాలు పోసి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తాటిబెల్లం కాఫీ తయారవుతుంది. ఈ కాఫీ తయారు చేసేటప్పుడు డికాషన్ మరియు పాలు మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి. ఇలా తాటిబెల్లంతో కాఫీని తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.