Thimmanam : పూర్వకాలంలో తయారు చేసిన తీపి పదార్థాల్లో తిమ్మనం ఒకటి. దీని గురించి ప్రస్తుత కాలంలో చాలా మందికి తెలిసి ఉండదు. బియ్యం, పచ్చికొబ్బరి ఉపయోగించి చేసే ఈ తిమ్మనం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి పాయసం అని కూడా అంటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ తిమ్మనం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎంతో రుచిగా ఉండే తిమ్మనాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తిమ్మనం స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – అర కప్పు, పచ్చికొబ్బరి ముక్కలు – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, పాలు – రెండున్నర కప్పులు, బెల్లం – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని.
తిమ్మనం స్వీట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ బియ్యాన్ని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చికొబ్బరి ముక్కలు, నీళ్లు పోసి కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి ముక్కల వెనుక ఉండే నల్లటి భాగాన్ని తీసివేయాలి. ఇప్పుడు కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో బెల్లం తురుము, అర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత అందులో యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ బెల్లం నీటిని గోరు వెచ్చగా అయిన పాలు, బియ్యం మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ను తిమ్మనంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తిమ్మనం తయారవుతుంది. ఇది గట్టిగా ఉంటే మరికొద్దిగా బెల్లం నీటిని వేసి కలపాలి. దీనిని గోరు వెచ్చగా తిన్నా లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత తిన్నా కూడా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా రుచిగా, చాలా తక్కువ సమయంలో అయ్యే తిమ్మనాన్ని చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.