Thokkudu Laddu : ఎంతో రుచిక‌ర‌మైన తొక్కుడు ల‌డ్డూను స్వీట్ షాపు స్టైల్‌లో ఇలా చేసుకోవ‌చ్చు..!

Thokkudu Laddu : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే వివిధ ర‌కాల ప‌దార్థాల్లో తొక్కుడు ల‌డ్డూలు కూడా ఒక‌టి. తొక్కుడు ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా ఉంటాయి. ఈ తొక్కుడు ల‌డ్డూల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే తొక్కుడు ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

తొక్కుడు ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – 300 గ్రా., పంచ‌దార – 300 గ్రా., యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Thokkudu Laddu recipe in telugu how to make this
Thokkudu Laddu

తొక్కుడు ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా శ‌న‌గ‌పిండిలో నీళ్లు పోసి దోశ పిండిలా ప‌లుచుగా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బూందీ గంటెతో బూందీని వేసుకోవాలి. ఈ బూందీ వేసేట‌ప్పుడు మంట పెద్ద‌గా ఉండేలా చూసుకోవాలి. బూందీ వేసిన త‌రువాత మంటను చిన్న‌గా చేయాలి. ఈ బూందీని క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా బూందీని త‌యారు చేసుకున్న త‌రువాత ఈ బూందీని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ బూందీ మిశ్ర‌మాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో పంచ‌దార‌, 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఈ పంచ‌దార క‌రిగి జిగురుగా అయ్యే వ‌ర‌కు క‌లుపుతూ వేడి చేయాలి. ఇలా వేడి చేసిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న బూందీ మిశ్ర‌మం, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచాలి.

త‌రువాత మూత తీసి మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మం చ‌ల్లారే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత చేతికి నెయ్యి రాసుకుంటూ త‌గినంత మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ల‌డ్డూగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తొక్కుడు ల‌డ్డు త‌యార‌వుతుంది. వీటిని గాలి, త‌డి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి. పండుగ‌ల‌కు లేదా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చాలా సుల‌భంగా తొక్కుడు ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts