Thokkudu Laddu : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో తొక్కుడు లడ్డూలు కూడా ఒకటి. ఈ లడ్డూల రుచి గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఈ లడ్డూలు ఉంటాయి. ఈ తొక్కుడు లడ్డూలను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తొక్కుడు లడ్డూలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తొక్కుడు లడ్డు తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, యాలకులు – 5, పంచదార – ఒక కప్పు,నీళ్లు – ఒక కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్.
తొక్కుడు లడ్డు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని జంతికల పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జంతికల గొట్టంలో పిండిని ఉంచి జంతికల్లా వత్తుకోవాలి. ఈ జంతికలను ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వత్తుకున్న తరువాత వాటిని ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే యాలకులను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని జల్లెడలా వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత దీనిని లేత పాకం కంటే తక్కువగా కొద్దిగా జిగురుగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార మిశ్రమంలో జల్లించిన పిండిని వేసుకుని కలుపుకోవాలి. ఈ పిండి వేయగానే పలుచగా ఉంటుంది.
కానీ కలిపే కొద్ది గట్టిగా అవ్వడంతో పాటు రంగు కూడా మారుతుంది. ఈ పిండిని గట్టిగా అయ్యే వరకు కలిపిన తరువాత ఒక ప్లేట్ కు నెయ్యి రాసి అందులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చేతికి నెయ్యా రాసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి గట్టి పడి లడ్డూ చేయడానికి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. లడ్డు చేయడానికి వచ్చిన తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ తగిన పరిమాణంలో శనగపిండి మిశ్రమాన్ని తీసుకుని లడ్డూగా చుట్టుకోవాలి. తరువాత వీటిపై వేయించిన ఢ్రైఫ్రూట్స్ ను ఉంచి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే తొక్కుడు లడ్డూలు తయారవుతాయి. ఈ విధంగా ఇంట్లోనే తొక్కుడు లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ లడ్డూలను అందరూ ఇష్టంగా తింటారు.