Thotakua Vepudu : మనం తోటకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. సులభంగా బరువు తగ్గవచ్చు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇలా తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తోటకూరతో ఎక్కువగా చేసే వంటకాల్లో తోటకూర వేపుడు కూడా ఒకటి. తోటకూర వేపుడు చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే తోటకూర వేపుడు కంటే కింద చెప్పిన విధంగా చేసే ఈ తోటకూర వేపుడు మరింత రుచిగా ఉంటుందని చెప్పవచ్చు. తోటకూరను తినని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు. మరింత రుచిగా, అందరికి నచ్చేలా తోటకూర వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, కరివేపాకు – 2 రెమ్మలు, తోటకూర – 5కట్టలు ( మధ్యస్థంగా ఉన్నవి), వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 12, ఎండుమిర్చి – 15 నుండి 20, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
తోటకూర వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత తోటకూర వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత దీని మీద మూత పెట్టి కూర మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. ఆకుకూర మగ్గుతుండగానే జార్ లో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఆకుకూర పూర్తిగా మగ్గిన తరువాత ఇందులో పసుపు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. దీనిని అంతాకలిసేలా కలుపుకున్న తరువాత మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తోటకూరతో వేపుడును తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా తయారు చేసిన తోటకూర వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.