Thotakura Curry : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణులు కూడా దీనిని ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. తోటకూరను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇలా అనేక రకాలుగా తోటకూర చక్కటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. తరచూ చేసే వంటకాలతో పాటు తోటకూరతో కూరను కూడా తయారు చేసుకోవచ్చు. పప్పులు వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చక్కటి రుచిని, ఆరోగ్యాన్ని అందించే ఈ తోటకూర కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, పెసరపప్పు – ఒక టేబుల్ స్పూన్, కందిపప్పు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన తోటకూర – 2 కట్టలు, తరిగిన టమాటాలు – 2, తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు -5, ఎండుమిర్చి – 5, తరిగిన పచ్చిమిర్చి – 5, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగింనత, పసుపు – అర టీ స్పూన్.
తోటకూర కర్రీ తయారీ విధానం..
ముందుగా పప్పులను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత వీటిని కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, తోటకూర, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాట ముక్కలను, కొత్తిమీరను పూర్తిగా మగ్గించాలి. ఇలా మగ్గించిన తరువాత ఉడికించిన పప్పు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తోటకూర కర్రీని తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.