Thotakura Pappu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనతను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కంటిచూపును పెంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా తోటకూర మనకు మేలు చేస్తుంది. తోటకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో తోటకూర పప్పు కూడా ఒకటి. ఇతర ఆకుకూరల వలె తోటకూరతో కూడా మనం ఎంతో రుచిగా ఉండే పప్పును తయారు చేసుకోవచ్చు. ఈ పప్పును తయారు చేయడం చాలా సులభం. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూరతో రుచిగా, కమ్మగా పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు- ఒక కప్పు, తరిగిన తోటకూర – 3 కట్టలు ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన టమాటాలు – 2, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, చింతపండు – నిమ్మకాయంత, నీళ్లు – అర గ్లాస్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒకటేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 3, తరిగిన ఉల్లిపాయ – 1.
తోటకూర పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తోటకూరతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి మూత పెట్టాలి. తరువాత ఈ కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పప్పును మెత్తగా చేసుకుని తగినన్ని నీళ్లు పోసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మిగిలిన తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత పప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.