Thotakura Pulusu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఈ విధంగా తోటకూర అనేక రకాలుగా మనకు సహాయపడుతుంది. తోటకూర అనగానే చాలా మంది తోటకూర ఫ్రై మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ తోటకూరతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసు కూరను కూడా తయారు చేసుకోవచ్చు. తోటకూర పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ తోటకూర పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన తోటకూర – పెద్దవి రెండు, నీళ్లు – 100 ఎమ్ ఎల్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు -తగినంత, చింతపండు పులుసు – ఒక టేబుల్ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, సాంబార్ పొడి – అర టీ స్పూన్.
తోటకూర పులుసు కూర తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో తరిగిన తోటకూరను తీసుకోవాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నీళ్లు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి తోటకూరను మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో చింతపండు వేసి కలపాలి. ఇప్పుడు తాళింపు కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత తోటకూర వేసి కలపాలి.
దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత సాంబార్ పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా తోటకూరతో పులుసును తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.