Thotakura Tomato Pachadi : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరలల్లో తోటకూర కూడా ఒకటి. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. తోటకూరతో ఎక్కువగా పప్పు, వేపుడు, పులుసు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా తోటకూరతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. తోటకూర, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఆకుకూరలు తినని పిల్లలకు ఇలా పచ్చడిని చేసి పెట్టవచ్చు.ఈ తోటకూర పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే తోటకూర టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తోటకూర కట్టలు – 3, టమాటాలు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – చిటికెడు, జీలకర్ర – అర టీ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 10, చింతపండు – చిన్న నిమ్మకాయంత, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, ఉప్పు – తగినంత, తరిగిన ఉల్లిపాయ – 1.
తోటకూర టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత తోటకూర వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి తోటకూరను మరో 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు, చింతపండు వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని చిన్న మంటపై టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. తోటకూర చల్లారిన తరువాత జార్ లోకి తీసుకోవాలి.
ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ తాళింపును పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తోటకూరతో పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.