Tomato Bajji : సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో బజ్జీలు ఒకటి. వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. సాయంత్రం కాగానే రోడ్ల పక్కన బండ్ల మీద వీటిని విరివిరిగా తయారు చేస్తారు. మనకు కేవలం మిరపకాయ బజ్జీలే కాకుండా వివిధ రుచుల్లో కూడా ఇవి లభ్యమవుతాయి. మనకు బండ్ల మీద లభించే బజ్జీలల్లో టమాట బజ్జీ కూడా ఒకటి. ఈ బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అచ్చం బయట లభించే విధంగా ఈ టమాట బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట బజ్జి తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 6 ( మధ్యస్థంగా ఉన్నవి),శనగపిండి – ముప్పావు కప్పు, ఉప్పు – తగినంత, వాము పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, అటుకులు – ఒక కప్పు, కార్న్ ఫ్లేక్స్ – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, నిమ్మరసం – కొద్దిగా, వేయించిన పల్లీలు – కొద్దిగా.

టమాట బజ్జి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అటుకులు వేసి వేయించుకోవాలి. అటుకులు వేగిన తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో కార్న్ ఫ్లేక్స్ ను కడా వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, వాముపొడి, పసుపు, ధనియాల పొడి, వంటసోడా వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి బజ్జి పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె మరలా వేడి చేయాలి. టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. నూనె వేడయ్యాక ఒక్కో టమాటాను పిండిలో ముంచి నూనెలో వేసి కాల్చుకోవాలి. వీటిని చిన్న మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని పక్కకు తీసుకోవాలి.
ఇలా అన్నీ బజ్జీలను కాల్చుకున్న తరువాత వీటిని మరలా పిండిలో ఉంచి నూనెలో వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని పక్కకు తీసుకోవాలి. ఇలా బజ్జీలన్నింటిని కాల్చుకున్న తరువాత మిగిలిన పిండిని కూడా నూనెలో వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో బజ్జీని తీసుకుని చాకుతో మధ్యలోకి కట్ చేయాలి. తరువాత అందులో ఉండే టమాటాను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో వేయించిన అటుకులు, వేయించిన కార్న్ ఫ్లేక్స్ ను కొద్దిగా కొద్దిగా వేయాలి. తరువాత ఉప్పు, కారం, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, బజ్జీలు వేయగా వేయించిన మిగిలిన పిండిని వేసి చేత్తో నలుపుతూ బాగా కలపాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని కట్ చేసిన బజ్జీల మధ్యలో అలాగే వాటి మీద ఉంచాలి. వీటిపై కొద్దిగా వేయించిన పల్లీలను, ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీరను, నిమ్మరసాన్ని అలాగే ఉప్పు, కారాన్ని కూడా చల్లి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం బయట బండ్ల మీద లభించే విధంగా ఉండే టమాట బజ్జీలు తయారవుతాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా ఈ బజ్జీలను చేసుకుని తింటే చాలా చక్కగా ఉంటాయి. అందరూ కూడా వీటిని విడిచిపెట్టకుండా ఇష్టంగా తింటారు.