Tomato Carrot Pulao : టమాటాలను చాలా మంది రోజూ వివిధ రకాలుగా వండుతుంటారు. వీటితో పచ్చడి, పప్పు వంటివి చేస్తుంటారు. ఇతర కూరగాయలతోనూ కలిపి వీటిని వండుతుంటారు. టమాటా లేకపోతే కూర అసలు పూర్తి కాదు. టమాటాలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే టమాటాలు, క్యారెట్లు కలిపి ఎంతో రుచికరమైన పులావ్‌ను కూడా తయారు చేయవచ్చు. దీన్ని పటాకా పులావ్ అని కూడా అంటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా క్యారెట్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు – రెండు, పచ్చి మిర్చి – ఎనిమిది, పుదీనా కట్ట – ఒకటి, కొత్తిమీర కట్ట – ఒకటి, టమాటాలు – రెండు, క్యారెట్ – ఒకటి, పెరుగు – అర కప్పు, ధనియాల పొడి – రెండు టీస్పూన్లు, పసుపు – అర టీస్పూన్, కారం – రెండు టీస్పూన్లు, గరం మసాలా పొడి – అర టీస్పూన్, నూనె – తగినంత, శనగపిండి – 100 గ్రాములు, ఉప్పు – సరిపడా.
టమాటా క్యారెట్ పులావ్‌ను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో శనగపిండి, కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర తురుము, కాస్త పచ్చిమిర్చి తురుము, కాస్త నూనె వేసి కలపాలి. తగినన్ని నీళ్లు చల్లి చిన్న ఉండలుగా చేసి చేతులతో పాముతూ బుల్లెట్ల మాదిరిగా చేసి కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. ఓ మందపాటి గిన్నెలో 100 గ్రాముల నూనె పోసి ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి, మిగిలిన పచ్చి మిర్చి ముక్కలు, పుదీనా తురుము, మిగిలిన కొత్తీమర తురుము, కారం, పసుపు, గరం మసాలా, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించాలి. తరువాత పెరుగు వేసి ముప్పావు లీటర్ నీళ్లు పోసి ఉప్పు వేసి కలపాలి. ఎసరు మరిగాక కడిగిన బియ్యం వేసి మూత పెట్టి ఉడికించాలి. నీరు దాదాపుగా ఇంకిపోయాక వేయించిన బుల్లెట్లు వేసి కలిపి సన్నని మంట మీద అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉంచి దించాలి. దీంతో రుచికరమైన టమాటా, క్యారెట్ పులావ్ రెడీ అవుతుంది. దీన్ని కూర అవసరం లేకుండానే నేరుగా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.