Tomato Coconut Pulao : మనం వంటింట్లో నాన్ వెజ్ తోనే కాకుండా వివిధ రకాల వెజ్ పులావ్ లను కూడా వండుతూ ఉంటాము. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన రుచికరమైన పులావ్ వెరైటీలల్లో టమాట కొకోనట్ పులావ్ కూడా ఒకటి. టమాటాలు, కొబ్బరి పాలతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. మసాలా కూరలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా ఈ పులావ్ ను తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం పులావ్ లు కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేయవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ టమాట కొకోటన్ పులావ్ తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కొకోనట్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పండిన టమాటాలు – 350 గ్రా., చిక్కటి కొబ్బరి పాలు – ఒకటిన్నర కప్పు, నూనె – పావు కప్పు, బిర్యానీ ఆకులు – 2, దాల్చినచెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, యాలకులు – 4, తరిగిన పచ్చిమిర్చి – 6 లేదా 7, గంటపాటు నానబెట్టిన బియ్యం – ఒకటిన్నర కప్పు, నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – తగినంత.
టమాట కొకోనట్ పులావ్ తయారీ విధానం..
ముందుగా టమాటాలకు గాట్లు పెట్టి అవి మునిగే వరకు నీటిని పోసి టమాటాలను మెత్తగా ఉడికించాలి. తరువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి టమాటాలను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత బియ్యం వేసి తడి పోయే వరకు వేయించాలి. తరువాత కొబ్బరిపాలు, టమాట ఫ్యూరీ, నీళ్లు పోసి కలపాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. దీనిపై మూతపెట్టి మధ్యస్థ మంటపై నీరంతా పోయే వరకు ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి ఆవిరి పోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కొబ్బరి పులావ్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.