Tomato Karam : టమాట కారం.. మనం టమాటాలతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. టమాట కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని 15 నిమిషాల్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా టమాటకారాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఒక్కసారి తయారు చేసి పెడితే ఈ కారం 4 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు అప్పటికప్పుడు ఇలా టమాట కారాన్ని తయారు చేసుకుని తినవచ్చు. తిన్నాకొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ టమాట కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను.. ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
పండిన టమాటాలు – 6, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 15, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు -తగినంత, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
టమాట కారం తయారీ విధానం..
ముందుగా ఒక టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత జార్ లో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలోకలుపుతూ టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కారం తయారవుతుంది. దీనిని అన్నంతో అల్పాహారాలతో కూడా తినవచ్చు. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా టమాట కారాన్ని తయారు చేసుకుని తినవచ్చు.