Tomato Kothimeera Pachadi : టమాట కొత్తిమీర పచ్చడి.. టమాటాలు, కొత్తిమీర కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా ఈ పచ్చడిని తయారు చేసి తీసుకోవచ్చు. కూర లేకపోయినా కూడా ఈ పచ్చడితో కడుపు నిండా భోజనం చేయవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ టమాట కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కొత్తిమీర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, మెంతులు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 10, వెల్లుల్లి రెబ్బలు – 8, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 10, తరిగిన టమాటాలు – అరకిలో, కొత్తిమీర – ఒక కట్ట, చింతపండు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్.
టమాట కొత్తిమీర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసివేడి చేయాలి. తరువాత ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి చక్కగా వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించాలి.
టమాట ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత తరిగిన కొత్తిమీర, చింతపండు వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని ఒక నిమిషం పాటు మగ్గించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన దినుసులను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కొత్తిమీర పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.