Tomato Masala Rice : మనం వంటింట్లో వివిధ రకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చేసుకోదగిన కమ్మటి రైస్ వెరైటీలల్లో టమాట మసాలా రైస్ కూడా ఒకటి. టమాటాలతో చేసే ఈ రైస్ చాలారుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు దీనిని తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ టమాట మసాలా రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మసాలా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, సాజీరా – పావు టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 4, జాపత్రి – కొద్దిగా, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, అనాస పువ్వు – 1ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, జీడిపప్పు – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 4,పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నానబెట్టిన బియ్యం – ఒక గ్లాస్, నీళ్లు – 2 గ్లాసులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, గరం మసాలా – అర టీ స్పూన్.
టమాట మసాలా రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, జీడిపప్పు వేసివేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత బియ్యం వేసి కలపాలి.
వీటిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత కొత్తిమీర, గరం మసాలా వేసికలిపి ఉడికించాలి. దీనిపై మూత పెట్టి నీరంతా పోయే వరకు మద్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసితడి పోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మసాలా రైస్ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన టమాట మసాలా రైస్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.