Tomato Pulao : టమాట పులావ్.. టమాటాలతో సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో ఇది కూడా ఒకటి. టమాట పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ పులావ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే వంటరానివారు., బ్యాచిలర్స్ కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అందరికి ఈ టమాట పులావ్ నచ్చుతుందని చెప్పవచ్చు. చాలా తక్కువ సమయంలో రుచిగా, కమ్మగా, అందరికి నచ్చేలా టమాట పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 2, బిర్యానీ ఆకు – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పుదీనా – గుప్పెడు, తరిగిన టమాటాలు – 4, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, అరగంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత.
టమాట పులావ్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పుదీనా వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత బాస్మతీ బియ్యం వేసి కలపాలి. తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పులావ్ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చాలా సులభంగా రుచిగా తక్కువ సమయంలో టమాట పులావ్ ను తయారు చేసుకుని తీసుకోవచ్చు.