Ullipaya Gongura Pachadi : మనం ఆహారంగా తీసుకునే ఆకు కూరలలో గోంగూర కూడా ఒకటి. ఇది మనందరికీ తెలుసు. గోంగూర పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ గోంగూరలో ఉంటాయి. గోంగూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో కొవ్వు స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. గోంగూర యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.
దీనిని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మనం తరచూ గోంగూరతో వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. గోంగూరతో చేసే పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ పచ్చడిలో ఉల్లిపాయలను వేసి మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ గోంగూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శుభ్రంగా కడిగిన గోంగూర – రెండు కట్టలు, నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిరపకాయలు – 5 లేదా రుచికి తగినన్ని.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – ఒకటి, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
ఉల్లిపాయ గోంగూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి కాగిన తరువాత పచ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత గోంగూరను కూడా వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి గోంగూరను కలిపి నీళ్లు అన్ని ఇంకిపోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. గోంగూర చల్లగా అయిన తరువాత జార్ లో వేసి రుచికి తగినట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత తాళింపు గింజలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలను, ఎండు మిర్చిని, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉప్పును, పసుపును వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసి కలిపి నూనె పైకి తేతే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ గోంగూర పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా గోంగూరను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.