Ullipaya Munakkaya : మనం మునక్కాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మునక్కాయలతో చేసే వంటకాలు చాలారుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే మునక్కయాలతో తరుచూ చేసే వంటకాలతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ మునక్కాయ కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, మునక్కాయ కలిపి చేసే ఈ కూర చాలారుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా ఈ కూరను తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఉల్లిపాయ మునక్కాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ మునక్కాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు – ఒకటిన్నర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన మునక్కాయలు – 2, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
ఉల్లిపాయ మునక్కాయ కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఉల్లిపాయ ముక్కలను మగ్గించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మునక్కాయ ముక్కలు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి. మునక్కాయ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ మునక్కాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలారుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.