Upma Bath : మనం అల్పాహారంగా తీసుకునే వంటకాల్లో ఉప్మా కూడా ఒకటి. ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఉప్మాను తయారు చేసుకోవచ్చు. అయితే తరుచూ ఒకేరకం ఉప్మా కాకుండా దీనిని మరింత రుచిగా కమ్మగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఉప్మా బాత్ కూడా చాలా రుచిగా ఉంటుంది. కూరగాయల ముక్కలు వేసి చేసే ఈ ఉప్మా బాత్ తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్న వారు, ఎప్పుడూ ఒకేరకం అల్పాహారాలను ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఈ ఉప్మా బాత్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్మా బాత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – కొద్దిగా, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, శనగపప్పు – అరటీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన బీన్స్ – 3, తరిగిన క్యాప్సికం – చిన్నది ఒకటి, తరిగిన టమాట – 1, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, నీళ్లు – మూడున్నర కప్పులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఉప్మా బాత్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో రవ్వను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి.
నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి కలపాలి.దీనిని అంతా కలిసేలా ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత నెయ్యి వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, వేయించిన జీడిపప్పు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉప్మా బాత్ తయారవుతుంది. దీనిని పల్లిచట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఉప్మా బాత్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.