Upma Pesarattu : ఉప్మా పెసరట్టు.. మనం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో ఇది కూడా ఒకటి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద ఇది లభిస్తూ ఉంటుంది. పల్లి చట్నీ, టమాట చట్నీ, అల్లం చట్నీ వంటి వాటితో తింటే ఈ ఉప్మా పెసరట్టు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. అందరికి నచ్చేలా, రుచిగా ఉప్మా పెసరట్టును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్మా పెసరట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన పెసర్లు – ఒక కప్పు, ఎండుమిర్చి – 5, అల్లం తరుగు- 2 ఇంచులు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు కప్పు.
ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్మా రవ్వ – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – పావు కప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, జీడిపప్పు – 15, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, నీళ్లు – 3 కప్పులు, పాలు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నెయ్యి – పావు కప్పు.
ఉప్మా పెసరట్టు తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. ఇందులోనే జీలకర్ర వేసి వేయించాలి. రవ్వ వేగిన తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని అందులో తగినంత ఉప్పు వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తరుగు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత నీళ్లు, పాలు పోసి కలపాలి. పాలు మరిగి పొంగు వచ్చిన తరువాత ఉప్మ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని 2 నిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి. చివరగా నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్మా తయారవుతుంది. ఇప్పుడు పెసరట్టు తయారీకి నానబెట్టిన పెసర్లను కడిగి జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో ఎండుమిర్చి, అల్లం తరుగు, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఈ శనగపిండి మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్న పిండిలో వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి ఉల్లిపాయతో తుడుచుకోవాలి. తరువాత పిండిని తీసుకుని అట్టులాగా వేసుకోవాలి. తరువాత దీనిపై ఉల్లిపాయ ముక్కలు వేసి గంటెతో అదుముకోవాలి. తరువాత చుట్టూ నూనె వేసి కాల్చుకోవాలి. పెసరట్టు ఎర్రగా కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. దీనిపై మరో టీ స్పూన్ నూనె వేసి ఒకనిమిషం పాటు కాల్చుకోవాలి. ఇప్పుడు పెసరట్టును మరలా తిప్పి దానిపై 3 టేబుల్ స్పూన్ల ఉప్మాను ఉంచి మధ్యలోకి మడిచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉప్మాపెసరట్టు తయారవుతుంది. దీనిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఉప్మా పెసరట్టును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.