Mosquitoes : ప్రస్తుత తరుణంలో మనందరికీ కూడా రోజురోజుకీ దోమల బెడద పెరుగుతూ ఉంది. దోమల వల్ల మనకు అనేక రకాల అంటు వ్యాధులు, వైరల్ ఇన్‌ఫెక్షన్స్, ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయి. అపరిశుభ్రమైన వాతావరణం, నీటి నిల్వలు ఉన్న చోట దోమలు అధికంగా ఉంటాయి. దోమలు మనతో పాటుగా సహజీవనం చేస్తున్నాయని చెప్పవచ్చు. దోమ కాటుకు గురి కావడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటి నుండి రక్షించుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం.
దోమలు కుట్టకుండా ఉండడానికి చర్మానికి ఆయింట్‌మెంట్స్, దోమ కాటును నివారించే లోషన్స్ వంటివి వాడడం చేస్తూ ఉంటాం. వీటి వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అలర్జీలు, స్కిన్ ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కవ కాలం పాటు వాడడం అంత మంచిది కాదు. సహజసిద్దంగా కూడా ఈ సమస్య నుండి మనం బయట పడవచ్చు. దోమ కాటుకు గురికాకుండా చేయడంలో మనకు టీ ట్రీ ఆయిల్ ఎంతగానో సహాయపడుతుంది.
టీ ట్రీ ఆయిల్ ను వాడడం వల్ల దోమలు మన దరి చేరవని వైద్యులు చెబుతున్నారు. టీ ట్రీ ఆయిల్ కు ఉండే ఒక రకమైన వాసన వల్ల దోమలు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. టెర్పినెన్ 4 ఓల్ అనే కెమికల్ వల్ల టీ ట్రీ ఆయిల్ కు ఈ వాసన వస్తుంది. టీ ట్రీ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ ఏజెంట్ గా కూడా ఉపయోగపడుతుంది. దీనిని దోమల ఆయిల్ గానే కాకుండా శానిటైజర్ గా కూడా వాడవచ్చు. రెండు లేదా మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ ను తీసుకుని చేతులకు, ముఖానికి, పలుచటి వస్త్రం ధరించిన చోట రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ ఆయిల్ నుండి వచ్చే వాసన కారణంగా దోమలు మన దగ్గరికి రాకుండా ఉంటాయి.
ఈ వాసన మన శరీరంపై 2 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. శానిటైజర్ గా కూడా దీనిని వాడడం వల్ల చేతులకు ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. మన ఇండ్లల్లో దోమల నివారణకు వాడే లిక్విడ్ డిఫ్యూజర్ లకు బదులుగా టీ ట్రీ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండే డిఫ్యూజర్ ను తీసుకుని అందులో టీ ట్రీ ఆయిల్ పోసి వెలిగించడం ద్వారా దీని నుండి వచ్చే వాసన కారణంగా దోమలు బయటకు వెళ్లిపోతాయి. దోమల నివారణకు మార్కెట్ లో దొరికే రసాయనాలను వాడడం కంటే టీ ట్రీ ఆయిల్‌ను వాడడం ఉత్తమం. దీని వల్ల ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని కలగదు.