Usiri Cutlet : మనకు ఈ సీజన్‌లో సహజంగానే ఉసిరికాయలు అధికంగా లభిస్తుంటాయి. వీటితో చాలా మంది పచ్చడి పెట్టుకుంటారు. కొందరు వీటిని గింజలు తీసేసి ఎండబెట్టి ఒరుగుల మాదిరిగా చేసి నిల్వ చేస్తుంటారు. వీటిని ఏడాది మొత్తం ఉపయోగించవచ్చు. అయితే ఉసిరికాయ పచ్చడి అంటే చాలా మందికి ఇష్టమే. కానీ ఉసిరికాయలతో మనం కట్‌లెట్‌లను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కారంగా, పులుపుగా, వగరుగా ఉంటాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే ఉసిరికాయలతో కట్‌లెట్‌లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి కట్‌లెట్‌ల తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉసిరికాయల తురుము – అర కప్పు, ఉడికించిన పెసలు – అర కప్పు, ఉడికించిన బంగాళాదుంపల ముద్ద – అర కప్పు, బియ్యం పిండి – అర కప్పు, ఉప్పు – తగినంత, కారం – అర టీస్పూన్, అల్లం పచ్చి మిర్చి ముద్ద – ఒక టీస్పూన్, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్, ధనియాల పొడి – ఒక టీస్పూన్, నూనె – తగినంత.
ఉసిరి కట్‌లెట్‌లను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో ఉడికించిన ఆలుగడ్డల ముద్ద, ఉడికించిన పెసలు, ఉసిరి తురుము, అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బియ్యం పిండి, కారం వేసి ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒక్కో ముద్దను పలుచని కట్‌లెట్‌లా చేసి పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చి తీయాలి. ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఉసిరికాయలు ఈ సీజన్‌లో మనకు బాగా లభిస్తాయి కనుక ఇలా వీటితో కట్‌లెట్‌లను తయారు చేసి తినవచ్చు. వీటిని తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి.