Usiri Deepam : కార్తీక మాసంలో ప్రతి సోమవారం భక్తులు అనేక పూజలు చేస్తుంటారు. ఉదయం సూర్యుడు రావడానికి ముందే స్నానపానాదులు ముగించి దీపం పెడతారు. అలాగే ఉదయాన్నే శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేస్తారు. అయితే కార్తీక సోమవారం రోజు ఉసిరి దీపం పెడితే ఎంతో మేలు జరుగుతుంది. దీని గురించి పురాణాల్లోనూ వివరించారు.
కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం వల్ల ఏడు జన్మల్లో చేసిన పాపాలు పోతాయట. అలాగే లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. ఉసిరి దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతోపాటు అదృష్టం కూడా కలసి వస్తుంది. దీంతోపాటు ఇంట్లోని వారందరి సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ఆరోగ్యం చక్కబడుతుంది. ఏమైనా దోషాలు ఉంటే పోతాయి. దుష్టశక్తుల నుంచి విముక్తి లభిస్తుంది. కనుక ఈ మాసంలో ఉసిరి దీపాన్ని తప్పక పెట్టాలి.
ఇక ఈ మాసంలో ఉసిరి దీపం పెట్టడం వెనుక సైన్స్ కూడా ఉంది. ఎలాగంటే.. ఈ సీజన్‌లో చాలా మందికి దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. అలాంటి సమయంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఉసిరి మనకు ఆ శక్తిని అందిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇలా కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం వల్ల మనం రెండు రకాలుగా లాభాలను పొందవచ్చు.