Vankaya Masala Fry : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ మసాలా ఫ్రై కూడా ఒకటి. స్పెషల్ గా తయారు చేసిన మసాలా పొడి వేసి చేసే ఈ వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కమ్మగా ఉండే వంకాయ మసాలా ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ మసాలా ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
గుత్తి వంకాయలు – అర కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, కరివేపాకు – పిడికెడు, ఎండుమిర్చి – 6, వెల్లుల్లి రెబ్బలు – 10, ఉప్పు – తగినంత.
వంకాయ మసాలా ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ధనియాలు, మెంతులు, పల్లీలు వేసి వేయించాలి. తరువాత నువ్వులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దినుసులన్నింటిని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వంకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత వీటిని బయటకు తీసి నీరంతా పోయిన తరువాత ఈ కారం పొడిని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక వంకాయలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి వంకాయలను ఒక వైపు మగ్గించాలి. తరువాత మరో వైపుకు తిప్పాలి. ఇప్పుడు పసుపు, కారం, కరివేపాకు, మిగిలిన పొడిని కూడా వేసి మూత పెట్టాలి. దీనిని మరో నాలుగు నిమిషాల పాటు మగ్గించిన తరువాత పొడి కలిసేలా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ మసాలా ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.