Vankaya Palli Karam : వంకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వంకాయలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ పల్లికారం కూడా ఒకటి. అన్నంతో తినడానికి, లంచ్ బాక్స్ లోకి లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ వంకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా, పొడవుగా తరిగిన వంకాయలు – అరకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 4 లేదా 5, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 5 లేదా 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, పల్లీలు – పావు కప్పు, శనగపప్పు – పావు కప్పు, ధనియాలు- 3 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, సోంపు గింజలు – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 3, లవంగాలు – 2, మిరియాలు – ఒక టీ స్పూన్, నువ్వులు – పావు కప్పు, చింతపండు – ఒక రెమ్మ.
వంకాయ పల్లికారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. ఇవి సగం వేగిన తరువాత శనగపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా మగ్గిన తరువాత నువ్వులు, చింతపండు తప్ప మిగిలిన దినుసులు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత చివరగా నువ్వులు, చింతపండు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత వంకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటువేయించిన తరువాత పసుపు, కారం, ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి వేసి కలపాలి. వీటిని అడుగు మాడిపోకుండా కలుపుతూ వేయించాలి. వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో తిన్నా లేదా సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.