Vankaya Perugu Pulusu : వంకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో తరుచూ చేసే వంటకాలతో పాటుగా మనం వంకాయ పెరుగు పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయలతో చేసే ఈ పెరుగు పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంకాయలను తినని వారు కూడా ఈ పెరుగు పులుసును ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో కమ్మగా ఉండే వంకాయ పెరుగు పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పెరుగు పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టీస్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2,పసుపు – అర టీ స్పూన్, తరిగిన సన్నటి లేత పొడవు వంకాయలు – అరకిలో, ఉప్పు – తగినంత,కారం – ఒక టీ స్పూన్, పెరుగు – 400 ఎమ్ ఎల్, నానబెట్టిన చింతపండు- నిమ్మకాయంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ పెరుగు పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత వంకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, కారం వేసి కలపాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి మూత పెట్టి వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. వంకాయ ముక్కలు వేగిన తరువాత పెరుగు, చిక్కటి చింతపండు రసం వేసి కలపాలి. తరువత మూత పెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పెరుగు పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన వంకాయ పెరుగు పులుసుని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.