Vankaya Tomato Kura : టమాట వంకాయ కూర.. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. అన్నం, చపాతీ వంటి వాటితో తినడానికి ఇది చాలాచక్కగా ఉంటుంది. చాలా మంది ఈ కూరను ఇష్టంగా తింటారు. అయితే తరుచూ ఒకే విధంగా కాకుండా ఈ కూరను మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే వంకాయ టమాట కూర చాలా రుచిగా ఉంటుంది. వంకాయలను ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా ఈ కూరను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా, కమ్మగా టమాట వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 6, జీలకర్ర- అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, లేత వంకాయలు – పావుకిలో, తరిగిన పెద్ద టమాటాలు – 3, ఉప్పు – తగినంత, పసుపు – పావు కప్పు, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్,తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట వంకాయ కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను, జీలకర్రను కలిపి కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత వంకాయ ముక్కలు, టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. వంకాయలు, టమాట ముక్కలు మెత్తగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట వంకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన వంకాయ టమాట కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.