Vankaya Vellulli Karam : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వంకాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ వెల్లుల్లి కారం కూడా ఒకటి. వంకాయలు, వెల్లుల్లి కారం కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు చాలా సులభంగా ఈ వంటకాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ వెల్లుల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
గుత్తి వంకాయలు – పావుకిలో, ఎండు కొబ్బరి చిప్ప – చిన్నది ఒకటి, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి – 1, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
వంకాయ వెల్లుల్లి కారం తయారీ విధానం..
ముందుగా గుత్తి వంకాయలకు గాట్లు పెట్టి ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత జార్ లో ఎండుకొబ్బరి ముక్కలు, ఉప్పు, జీలకర్ర, కారం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వంకాయలల్లో స్టఫ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వంకాయలు వేసి కలపాలి. వీటిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత మిగిలిన వెల్లుల్లి కారం, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై మధ్ మధ్యలో కలుపుతూ వేయించాలి. వంకాయ ముక్కలు మెత్తబడి నూనె పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ వెల్లుల్లి కారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన వంకాయ వెల్లుల్లి కారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.