Veg Fried Rice : మనం అన్నంతో వివిధ రకాల ఫ్రైడ్ రైస్ లను తయారు చేస్తూ ఉంటాము. అన్నంతో సులభంగా చేసుకోదగిన ఫ్రైడ్ రైస్ లల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. దీనిని ఎక్కువగా రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో తయారు చేస్తూ ఉంటారు. దీనిని చాలా మంది ఇష్టంగా తయారు చేస్తారు. అయితే బయట లభించే ఈ ప్రైడ్ రైస్ ను మసాలాలు, సాసెస్ ను ఎక్కువగా వేసి తయారు చేస్తూ ఉంటారు. అలాగే బాస్మతీ బియ్యంతో దీనిని తయారు చేస్తారు. ఇవేమీ లేకుండా మసాలాలు, సాసెస్ వేయకుండా చాలా సులభంగా కూడా మనం వెజ్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకోవచ్చు. మిగిలిన అన్నంతో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసి తీసుకోవచ్చు. రుచిగా, సులభంగా ఇంట్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – 4 లేదా 5, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6 నుండి 10, టమాట – పెద్దది ఒకటి, నూనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీస్పూన్, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, క్యాప్సికం ముక్కలు – పావు కప్పు, బంగాళాదుంప ముక్కలు – పావు కప్పు, ఫ్రెంచ్ బీన్స్ – పావు కప్పు, క్యారెట్ ముక్కలు – పావు కప్పు, స్వీట్ కార్న్ – పావు కప్పు, క్యాలీప్లవర్ ముక్కలు – పావు కప్పు, పచ్చిబఠాణీ- పావు కప్పు, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అన్నం – 4 నుండి 5 కప్పులు, స్ప్రింగ్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్.
వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, టమాట ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. కూరగాయ ముక్కలు మెత్తగా అయిన తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది.