Veg Kheema Masala : మనకు రెస్టారెంట్ లలో లభించే వెజ్ వెరైటీలలో వెజ్ ఖీమా కూడా ఒకటి. వెజ్ ఖీమా చాలా రుచిగా ఉంటుంది. బటర్ నాన్, రోటీ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ కర్రీని చాలా మంది ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఖీమాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఖీమాను తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఖీమాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ ఖీమా మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – 3, పచ్చిమిర్చి తరుగు – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన క్యాప్సికం తరుగు – అర కప్పు, టమాటాలు – పెద్దవి 3, సన్నని క్యారెట్ తరుగు – అర కప్పు, చిన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 10, నీళ్లు – 250 ఎమ్ ఎల్, జీడిపప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రోజెన్ బఠాణీ లేదా ఉడికించిన బఠాణీ -అర కప్పు, ప్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్.
వెజ్ ఖీమా మసాలా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె, బటర్ వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాశ్మీరి చిల్లీ కారం వేసి కలపాలి. తరువాత క్యాప్సికం తరుగు వేసి 2 నిమిషాల పాటువేయించాలి. తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి. తరువాత క్యారెట్ తరగు, ఫ్రెంచ్ బీన్స్ వేసి కలపాలి. టమాట ఫ్యూరీ వేగి క్యారెట్ ముక్కలు ఉడికిన తరువాత నీళ్లు పోసి కలపాలి.
తరువాత జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర, బఠాణీ వేసి కలపాలి. తరువాత ఫ్రెష్ క్రీమ్, నెయ్యి, కసూరిమెంతి వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై మరో 4 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఖీమా మసాలా తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ, పూరీ, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వెజ్ ఖీమాను తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.