Veg Masala Upma : రవ్వతో చేసుకోదగిన వంటకాల్లో ఉప్మా కూడా ఒకటి. ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉప్మా రుచిగా ఉన్నప్పటికి దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ కింద చెప్పిన విధంగా చేసే వెజ్ మసాలా ఉప్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. దీనిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ మసాలా ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ మసాలా ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, నూనె – పావు కప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర -ఒక టీ స్పూన్, మినపప్పు -ఒక టీ స్పూన్, శనగపప్పు -ఒక టీ స్పూన్, కరివేపాకు -ఒక రెమ్మ, జీడిపప్పు – 15, తరిగిన ఉల్లిపాయ- పెద్దది ఒకటి, తరిగిన బంగాళాదుంప – చిన్నది ఒకటి, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, క్యారెట్ ముక్కలు -పావు కప్పు, బీన్స్ ముక్కలు – పావు కప్పు, తరిగిన టమాట – 1, నీళ్లు – 3 కప్పులు, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – 4 టీ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క, నెయ్యి – 3 టీ స్పూన్స్.
వెజ్ మసాలా ఉప్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో రవ్వను వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, పచ్చిమిర్చి వేసివేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత క్యారెట్, బీన్స్ వేసి వేయించాలి. వీటిని 5 నుండి 6 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. ఈ టమాట ముక్కలు మెత్తబడిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత ఉప్పు వేసి కలిపి కూరగాయ ముక్కలను మెత్తగా ఉడికించాలి.
కూరగాయ ముక్కలు ఉడికిన తరువాత కొద్ది కొద్దిగా రవ్వ వేసి కలుపుకోవాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొబ్బరి తురుము, నిమ్మరసం, నెయ్యి వేసి కలపాలి. అంతా కలిసేలా చక్కగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ మసాలా ఉప్మా తయారవుతుంది. ఈ ఉప్మాను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఉప్మా అంటే ఇష్టంలేని వారు కూడా ఈ వెజ్ మసాలా ఉప్మాను ఇష్టంగా తింటారు.