Veg Sandwich : వెజ్ సాండ్విచ్.. బ్రెడ్ తో చేసుకోదగిన స్నాక్స్ లల్లో ఇది కూడా ఒకటి. ఇది ఎక్కువగా మనకు బయట లభిస్తూ ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ సాండ్విచ్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. అల్పాహారంగా, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ సాండ్విచ్ ను తయారు చేయడం చాలా సులభం. కేవలం 10 నిమిషాల్లోనే దీనిని తయారు చేసుకుని తినవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా వెజ్ సాండ్విచ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ వెజ్ సాండ్విచ్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ సాండ్విచ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సాండ్విచ్ బ్రెడ్ – 6, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన కీరదోస ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన క్యాబేజి తరుగు – అర కప్పు, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – పావు కప్పు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, మయనీస్ – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
గ్రీన్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర – పావు కప్పు, పుదీనా – పావు కప్పు, పచ్చిమిర్చి – 2, అల్లం – అర ఇంచు ముక్క, ఉప్పు – తగినంత, చాట్ మసాలా – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
వెజ్ సాండ్విచ్ తయారీ విధానం..
ముందుగా మనం గ్రీన్ చట్నీని ఎలా తయారు చేసుకుందాం. దీని కోసం జార్ లో చట్నీకి కావల్సిన పదార్థాల్నీ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత సాండ్విచ్ తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో బ్రెడ్ తప్ప మిగిలిన పదార్థాల్నీ వేసి బాగా కలపాలి. తరువాత రెండు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటికి ఒక వైపు బటర్ ను రాసుకోవాలి. ఇలా బటర్ ను రాసిన తరువాత దానిపై ముందుగా తయారు చేసిన గ్రీన్ చట్నీని రాసుకోవాలి. ఇలా రెండు బ్రెడ్ స్లైసెస్ కు గ్రీన్ చట్నీని రాసిన తరువాత ఒక బ్రెడ్ స్లైస్ పై స్టఫింగ్ ను వేసుకోవాలి. దీనిని బ్రెడ్ అంతా సమానంగా చేసుకున్న తరువాత దానిపై మరో బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి.
ఇప్పుడు కళాయిలో అర టేబుల్ స్పూన్ బటర్ ను వేసి వేడి చేయాలి. తరరువాత సాండ్విచ్ ను ఉంచాలి. ఇప్పుడు పై భాగంలో మరికొద్ది బటర్ రాసి మూత పెట్టాలి. దీనిని మధ్యస్థ మంటపై అర నిమిషం నుండి నిమిషం వరకు కాల్చుకోవాలి. తరువాత మూత తీసి మరో వైపుకు నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ సాండ్విచ్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.