Vellulli Karam : సీజన్లను బట్టి చాలా మంది వివిధ రకాల ఆహారాలను తింటుంటారు. అయితే వర్షాకాలంలో సహజంగానే చల్లని వాతావరణం ఉంటుంది. పైగా కార కారంగా తినాలని అనిపిస్తుంది. దీంతో రోడ్డు పక్కన లభించే జంక్ ఫుడ్‌ను అధికంగా తింటారు. అయితే ఆ అలవాట్లు మనకు హాని చేస్తాయి. ఈ సీజన్‌లో మనకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా అవసరం అవుతుంది. ఈ క్రమంలోనే ఆ శక్తిని పెంచే ఆహారాలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇక రోగ నిరోధక శక్తిని పెంచే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒకటి. దీన్ని నేరుగా తినేకంటే కారంగా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ క్రమంలోనే వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు – 1 కప్పు (పొట్టు తీసినవి), ఎండు మిర్చి – 15 నుంచి 20, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు, మినప పప్పు – 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, మెంతులు – అర టీస్పూన్, ఆవాలు – అర టీస్పూన్, మిరియాలు – అర టీస్పూన్, ఇంగువ – పావు టీస్పూన్, పసుపు – 1 టీస్పూన్, నూనె – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
వెల్లుల్లి కారంను తయారు చేసే విధానం..
స్టవ్ వెలిగించి మీడియం మంటపై ఉంచి దానిపై పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. అందులోనే శనగపప్పు, మినప పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మిరియాలు వేసి వేయించాలి. చక్కని వాసన వచ్చే వరకు వేయించాక అదే పాన్‌లో ఎండు మిర్చి వేసి వేయించాలి. దీంతో మిర్చి మరింత కరకరలాడుతాయి. ఈ మిశ్రమాన్ని తీసి చల్లార్చాలి. తరువాత అదే పాన్‌లో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా వేయించాలి. దీంతో వెల్లుల్లి రెబ్బలు బంగారు రంగులోకి మారుతాయి. తరువాత అన్నింటినీ కలిపి మిక్సీలో వేయాలి. అందులోనే పసుపు, ఇంగువ, ఉప్పు వేయాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని కాస్త బరకగా ఉండేలా మిక్సీ పట్టాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం రెడీ అవుతుంది. దీన్ని ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్‌లో తినవచ్చు. లేదా వేడి అన్నంలో నెయ్యి వేసి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఇలా తయారు చేసి వర్షాకాలంలో తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి.