Vellulli Tomato Nilva Pachadi : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పచ్చళ్లను తినడానికి ఇష్టపడతారు. టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో వెల్లుల్లి టమాట నిల్వ పచ్చడి కూడా ఒకటి. వెల్లుల్లి రెబ్బలు, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, అలాగే అల్పాహరాల్లోకి ఈ పచ్చడి చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలాసులభం. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే వెల్లుల్లి టమాట నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి టమాట నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – 50 గ్రా., టమాటాలు – అరకిలో, చింతపండు – నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఎండుమిర్చి – 2, కరివేపాకు – 2 రెమ్మలు, కారం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత, వేయించిన ఆవాల పొడి – ఒక టీ స్పూన్, వేయించిన మెంతుల పొడి – అర టీ స్పూన్.
వెల్లుల్లి టమాట నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో టమాట ముక్కలు, చింతపండు వేసి ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, ముందుగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో అర కప్పు నూనె వేసి వేడి చేయాలి.
తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడి, కారం, ఆవ పిండి, మెంతి పిండి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి టమాట నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.