Venkatesh : తెలుగు సినీ ప్రేక్షకులకు విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కెరీర్ తొలినాళ్లలో చేసిన అన్ని సినిమాలు హిట్ అందుకున్నాయి. అందుకే ఆయనను అభిమానులు ముద్దుగా విక్టరీ వెంకటేష్ అని పిలుచుకుంటారు. లెజెండరీ నిర్మాత రామానాయుడు దగ్గుబాటి వారి వారసుడిగా వెంకటేష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన సహజమైన నటనతో హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. వెంకటేష్ కెరీర్ లో ఫ్లాప్ సినిమాల కంటే బ్లాక్ బస్టర్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.
వెంకటేష్ సినిమాలను చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేవారు. అంతేకాకుండా కేవలం ఒకే రకమైన సినిమాలకు పరిమితం అవ్వకుండా విభిన్నమైన పాత్రలు కలిగిన చిత్రాలను ఎంచుకుంటూ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. మొదటి నుంచి వెంకటేష్ స్టార్ హీరో అయినప్పటికీ మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఆయన కెరీర్ లో మల్టీస్టారర్ చిత్రాలు చాలానే ఉన్నాయి.
హీరో సుమన్ తో కొండపల్లి రాజా, హీరో అబ్బాస్ తో రాజా, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, నాగచైతన్యతో వెంకీ మామ వంటి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు వెంకటేష్. ఇక ఇవే కాకుండా వెంకటేష్ కెరీర్ బిగినింగ్ లో కూడా మల్టీస్టారర్ చిత్రాలను చేయడానికి సిద్ధమయ్యారు.
వెంకటేష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే రెబల్ స్టార్ కృష్ణంరాజుతో కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా నటభూషణ శోభన్ బాబుతో కూడా ఓ మల్టీస్టారర్ ను మొదలుపెట్టారు. శోభన్ బాబు, వెంకటేష్ కలిసి నటించవలసిన చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి సంగీత దర్శకుడిగా బప్పి లహరిని నియమించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.
అదేవిధంగా కృష్ణంరాజు, వెంకటేష్ ల కాంబినేషన్ లోనూ మల్టీ స్టారర్ గా ప్రారంభించిన చిత్రానికి సెల్వమణి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ సినిమాలో విజయశాంతిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ అదే సమయంలో మళయాళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమా కథను బి గోపాల్ వెంకటేష్ తో చర్చలు జరపడంతో సెల్వమణి సినిమా పక్కన పెట్టేసి వెంకటేష్ ఆ సినిమాని కమిట్ అయి నటించడం జరిగింది. అలా అప్పట్లో వెంకటేష్ చేయాల్సిన రెండు మల్టీ స్టారర్ చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి.