Venna Gottalu : బియ్యంపిండితో మనం రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండితో చేసే వివిధ రకాల పిండి వంటకాల్లో వెన్న గొట్టాలు కూడా ఒకటి. వెన్న గొట్టాలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. టీ టైంలో స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. బియ్యంపిండితో తరుచూ చేసే పిండి వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా వెన్న గొట్టాలను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. రుచిగా, గుల్లగుల్లగా ఉండే ఈ వెన్న గొట్టాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్న గొట్టాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యంపిండి – 4 కప్పులు, మినపప్పు – ఒక కప్పు, పుట్నాల పప్పు – అర కప్పు, ముదిరిన పచ్చికొబ్బరి ముక్కలు – 2 కప్పులు, నీళ్లు – 4 కప్పులు, ఉప్పు – తగినంత, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
వెన్న గొట్టాల తయారీ విధానం..
ముందుగా కళాయిలో బియ్యంపిండి వేసి 2 నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మినపప్పు వేసి వేయించాలి. దీనిని దోరగా వేయించిన తరువాత పుట్నాల పప్పు వేసి వేయించాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో వేయించిన పుట్నాల పప్పు, మినపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మినపప్పు పొడిని జల్లెడలో వేసి జల్లించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జల్లెడలో వేయించిన బియ్యంపిండిని కూడా వేసి జల్లించి అదే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పిండిలో కారం వేసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో కొబ్బరి ముక్కలు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీని నుండి కొబ్బరి పాలను తీసుకోవాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి అందులో ఉప్పు, బటర్ వేసి కలపాలి. పాలు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను పిండిలో వేసి గంటెతో కలుపుకోవాలి. అవసరమైతే మరికొన్ని వేడి నీళ్లను పోసి కలపాలి.
తరువాత మూత పెట్టి పిండి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత చేత్తో బాగా కలుపుకోవాలి. తరువాత మురుకుల గొట్టాన్ని తీసుకుని అందులో రిబ్బన్ పకోడాను వత్తకోవడానికి కావల్సిన బిళ్లను ఉంచాలి. తరువాత పిండిని ఉంచి రిబ్బను వలె ప్లేట్ పై వత్తుకోవాలి. తరువాత ఈ రిబ్బన్ ను సమానంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక్కో ముక్కను తీసుకుని గుండ్రంగా చుట్టుకుని ప్లేట్ లో ఉంచాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత గొట్టాలను వేసి వేయించాలి. ఇవి కొద్దిగా కాలిన తరువాత అటూ ఇటూ తిప్పుతూ మధ్యస్థ మంటపై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెన్న గొట్టాలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల మెత్తబడకుండా చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి.