Viral Video : పాము అనే ఆలోచన మనకు రాగానే మొదట భయం కలుగుతుంది. ఇక పాము ఎదురుగా వస్తే అంతే సంగతులు. వెంటనే అక్కడి నుంచి పారిపోతాం. పాము పేరు చెబితేనే కొందరికి వెన్నులో భయం మొదలవుతుంది. కొందరు అసలు దాని పేరు చెప్పేందుకే ఇష్టపడరు. కానీ ఆ యువకుడు మాత్రం ఏకంగా మూడు తాచు పాములతో సరదాగా ఆట ఆడుకుందామనుకున్నాడు. కానీ చివరకు హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఒక యువకుడు భయంకరమైన మూడు తాచు పాములతో విన్యాసాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద షేర్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో సిర్సి ప్రాంతానికి చెందిన మాజ్ సయ్యద్ (20) అనే యువకుడు మూడు తాచు పాములతో విన్యాసాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఓ దశలో అతన్ని ఒక పాము కాటు వేసింది. అతని మోకాలి వద్ద ఆ పాము గట్టిగా కాటు వేసి అక్కడ అలాగే పట్టుకుంది. దీంతో అతన్ని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.
అయితే ప్రస్తుతం సయ్యద్ హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని.. సమయం గడిచే కొద్దీ అసలు విషయం తెలుస్తుందని.. వైద్యులు చెబుతున్నారు. కాగా సయ్యద్ చేష్టలు పాములను బెదిరించినట్టుగా, భయపెట్టే విధంగా ఉన్నాయని.. ఫలితంగానే పాము అతనిని అంత వేగంగా కాటు వేసిందని నిపుణులు చెబుతున్నారు.
ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ వీడియోను షేర్ చేసి తాచు పాములతో విన్యాసాలు చేయడం వల్ల ఆ పాము దానికి హాని కలుగుతందని భావించి కాటు వేసింది. కొన్ని సార్లు ఇలా చేయడం ప్రాణాంతకం.. అని తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.