Virat Kohli : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌కి ఎన్నో సేవలు చేశారు. కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించారు. క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డ్‌లు ఎవరు బ్రేక్ చేస్తారా అని ఇన్నాళ్లు అంతా ఎదురు చూడగా, వాటిలో కొన్ని ఇప్పటికే బ్రేక్ అయ్యాయి. మరికొన్ని మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉండేలా ఉన్నాయి. అందులో 100 అంతర్జాతీయ శతకాలు. వర్తమాన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ మాత్రమే 80 సెంచరీలతో సచిన్ రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. 35 ఏళ్ల విరాట్ ఫిట్‌గా ఉంటే మరో రెండుమూడేళ్లు క్రికెట్‌లో కొనసాగుతాడు. పైగా ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. వన్డే, టెస్టు ఫార్మాట్‌లు మాత్రమే ఆడతాడు. మిగతా 20 శతకాలు ఈ రెండు ఫార్మాట్ల ద్వారా చేయాల్సి ఉంటుంది.
బంగ్లాదేశ్ సిరీస్‌తో దాదాపు 9 నెలల విరామం తర్వాత టెస్టుల్లో బరిలో దిగనున్నాడు. అయితే ఈ సిరీస్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డుపై విరాట్ కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి అది ఏంటంటే? 35 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్‌ల్లో 26942 పరుగులు చేశాడు. 27 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు విరాట్ మరో 58 రన్స్ దూరంలో ఉన్నాడు. ఈ క్రమంలో రానున్న బంగ్లా టెస్టు సిరీస్‌లో విరాట్ ఫీట్ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ (623 ఇన్నింగ్స్) పేరిట ఉంది. అయితే విరాట్ ఈ రికార్డు బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక గతంలోనూ 16,000, 17,000, 18,000, 19,000, 20,000, 21,000, 22,000, 23,000, 24,000, 25,000, 26,000 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా ఉందుకున్న రికార్డు సైతం విరాట్ పేరిటే ఉంది. విరాట్ ఈ ఫీట్ అందుకుంటే, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 27 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ లిస్ట్‌లో సచిన్ తెందూల్కర్ (34357) టాప్‌లో ఉండగా కుమార సంగక్కర, రికీ పాంటింగ్ వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు.