Marriage : ప్రస్తుత కాలంలో చదువులు, ఉద్యోగాలు, జీవితంలో స్థిరపడాలని స్త్రీ, పురుషుల బేధం లేకుండా ప్రతి ఒక్కరు జీవితంలో పరిగెడుతున్నారు. స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ తమ కంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దీని కారణంగా వివాహం చేసుకోవడం ఆలస్యం అవుతుంది. వారు ఎంచుకున్న రంగాల్లో రాణించాలనే తాపత్రయంతో పిల్లల విషయాన్ని కూడా వాయిదా వేస్తున్నారు. దీని కారణంగా చాలా మంది సంతానలోపంతో బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో ఈ సమస్యతో బాధపడే వారు ఎక్కవవుతున్నారు. స్త్రీలు పురుషులతో సమానంగా అన్నీ రంగాల్లో రాణించాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ స్త్రీల కంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక అమ్మాయి జన్మించేటప్పుడు పరిమితమైన అండాలతోనే జన్మిస్తారు. ఆడపిల్ల పుష్పవతి అయినప్పటి ఈ అండాలు విడుదలవ్వడం ప్రారంభమవుతాయి.
ఇలా అండాలు 45 నుండి 50 సంవత్సరాల వరకు విడుదలై ఆ తరువాత ఆగిపోతాయి. జీవించే కాలం పెరుగుతున్నప్పటికి స్త్రీలల్లో అండాల సంఖ్య పెరగదు. కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా స్త్రీలల్లో ఈ అండాల సంఖ్య పెరగడం లేదు. అదే విధంగా 20 నుండి 25 సంవత్సరాల మధ్యలో స్త్రీలల్లో అధికంగా అండాలు విడుదల అవుతాయి. ఈ సమయంలోనే రుతుక్రమం సక్రమంగా జరగడం, త్వరగా గర్భం ధరించే అవకాశాలు అధికంగా ఉంటాయి. 25 నుండి 30 సంవత్సరాల వరకు కూడా గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ 30 సంవత్సరాల తరువాత గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లుతూ ఉంటాయి. స్త్రీల వయసు పెరిగే కొద్ది వారిలో విడుదల అయ్యే అండాల సంఖ్య తగ్గుతుంది. దీంతో వారు సంతానాన్ని పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
వయసు పెరిగే కొద్ది అండాలు తక్కువగా ఉత్పత్తి అవ్వడంతో పాటు శారీరకంగా కూడా చాలా మార్పులు జరుగుతాయి. దీంతో వారి గర్భధారణ సమయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్లు దాటిన తరువాత గర్భం దాల్చడం వల్ల గర్భధారణ షుగర్, బీపీ, థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్ల తరువాత గర్భం దాల్చడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక సరైన సమయంలో వివాహం చేసుకోవడం వల్ల సంతానపరమైన సమస్యలు ఎదురవకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.