Cow Comes At Home : హిందూ సాంప్రదాయంలో ఆవులకు ఎంతో విశిష్టత ఉంది. వీటిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందువులకు ఆవు ఆరాధ్యమైనది. అలాంటి గోమాతలు కొన్నిసార్లు మన ఇంటి ముందు ఆగుతాయి. ఇలా గోమాత ఇంటి ముందు ఆగడానికి సంకేతం ఏమిటి.. ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఏం చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పాదాల్లో పితృ దేవతలు, అడుగుల్లో ఆకాశ గంగ, స్థనాలలో చతుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపున కైలాసం ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది. అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది. ఆవు కొమ్ములు మూలుంలో బ్రహ్మ, విష్ణువులు నివసిస్తారు.
అగ్రభాగమున తీర్థస్థానంలో స్థావర జంగములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగమున శంకరుని గేహ బిగువు అంగాలలో చతుర్దస భువనాలు ఇమిడి ఉన్నాయని ఆదర్వణ వేదం చెబుతుంది. ఈ జగత్తుల్లో గో సంపదకు సమానమైన ధన సంపద ఉండదని శవన మహర్షి నహుషంలో ప్రవచించారు. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మ శాస్త్రాలైన భారత, రామాయణ, భాగవతాది పవిత్ర గ్రంథాల్లో కూడా గో మహిమ అసాధారణమైనదిగా అభివర్ణించారు. వాల్మీకి, వ్యాసుడు, ఆదిశంకరాచార్యులు, గౌతమ బుద్దుడు, స్వామీ వివేకానంద సరస్వతి, తులసీదాసు, కబీరు, చైతన్య మహా ప్రభు మొదలగు మాహానుభావులు గో సంరక్షణ యొక్క ఆవశ్యకతను నొక్కి వక్కానించారు. శ్రీ కృష్ణ భగవానుడుస్వయంగా గోమాతను పూజించి గోపాలుడు అయ్యాడు.
దిలీప చక్రవర్తి తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనకాడలేదు. జమదగ్ని గోసంరక్షణకై ఆత్మ త్యాగం చేసాడు. గోవులే స్వర్గ సోపానాలు. ఆవు ఇంటి ముందు నిల్చుంటే సకల దేవాను దేవులు ఇంటి ముందు వచ్చి నిల్చునట్టే. దీనికి ఒక పురాణం కూడా ఉంది. ఒకానొక్కప్పుడు పార్వతీ దేవి పరమశివున్ని భక్తితో పూజించి నాద స్త్రీలు తెలిసి తెలియక ముట్టు, అంటు కలిపిన దోషం, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం ఏవిధంగా పరహారం అవుతుందో చెప్పవలసిందిగా కోరుకుంటుంది. అప్పుడు శివుడు గోవు నందు సకల దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సకల పాపాలు తొలగిపోతాయి. గోవు నందు సమస్థ పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్టా దేవి, కళ్లల్లో సూర్య చంద్రులు, చెవులలో శంఖు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు.
కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవ గ్రహాలు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు, ఊపురమున బ్రహ్మ దేవుడు ఉండును. అట్టి గోవును పూజిస్తే సకల దోషాలు తొలగును అని బోధించాడు శివుడు. ఆవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభ గడియలు రానున్నాయని అర్థం. సకల దేవతల ఆశీస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థం. ఆ రోజు శుభవార్తలు వింటారని అర్థం. అలా ఆవు ఇంటి ముందు వచ్చి నిల్చునప్పుడు ముందుగా పూజించాలి. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం పెడితే సమస్త దేవతలు తృప్తిపడతారు. గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం దక్కుతుంది. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని పండితులు చెబుతున్నారు. కావున ఇంటి ముందు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకూడదు. వెంటనే గోవుకు ఏదో ఒకటి పెట్టాలని పండితులు చెబుతున్నారు.