Pasupu : కాళ్లకు పసుపు రాసుకోవడం అనేది ఎంతో కాలంగా మనం ఆచరిస్తున్న సంప్రదాయాల్లో ఒకటి. స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా కూడా దీనిని భావిస్తారు. పసుపు రాసిన పాదాలు చూడచక్కగా ఉంటాయి. పాదాలకు పసుపు రాసుకోవడం వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. కాళ్లకు పసుపు రాసుకోవడం మన సంప్రదాయం అయినప్పటికి పసుపు రాసుకోవడంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనం లక్ష్మీ దేవికి దూరం అవుతామని పండితులు చెబుతున్నారు. పసుపు రాసుకోవడానికి కొందరు చేతుల్లో పసుపు తీసుకుని నీటిని పోసి చేతుల్లోనే పసుపు కలిపి కాళ్లకు రాసుకుంటారు. చేతుల్లో పసుపు కలపడం అనేది అంత మంచి పద్దతి కాదు. లక్ష్మీ ప్రదం కూడా కాదు. ఒక గిన్నెలో పసుపును తీసుకుని అందులో నీటిని పోసి చక్కగా పసుపు కలపాలి. తరువాత మూడు వేళ్లతో పసుపును తీసుకుని కాళ్లకు రాసుకోవాలి.
నీటిలో సరిగ్గా పసుపును కలపకుండా కాళ్లకు రాసుకోవడం ఐశ్వర్యం కలిసి రాదు. కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి. కాళ్లనుకింద పెట్టి ఎప్పుడూ పసుపు రాసుకోకూడదు. పసుపు రాసుకునేటప్పుడు పాదాలు నేలకు తాకకుండా చూసుకోవాలి. నేల మీద ఏదైనా వస్త్రాన్ని వేసి దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి. అలాగే పాదం అంతటా కూడా పసుపును ఒకేవిధంగా రాసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా పసుపును రాసుకోకూడదు. మనమే కాదు ఎదుటి వారికి పసుపు రాసేటప్పుడు కూడా ఈ విధంగానే రాయాలి. అదేవిధంగా పాదాలకు పసుపు రాసుకునేటప్పుడు చీలమండలు దాటి పసుపు రాసుకోకూడదు. పాదం వెనుక కూడా పసుపు చక్కగా అంటేలా రాసుకోవాలి.
కొందరు కాళ్లకు పసుపు రాసుకుని అదే గిన్నెతో గడపలకు పసుపును రాస్తారు. ఇలా చేయడం శాస్త్ర ప్రకారం చాలా తప్పు. కాళ్లకు రాసుకుని పసుపును కాళ్లకు మాత్రమే వాడాలి. గడపకు రాసే పసుపును మరో గిన్నెలో కలుపుకుని గడపకు మాత్రమే వాడాలి. అలాగే పసుపు రాసుకున్న చోట ఎటువంటి గుర్తులు నేల మీద పడకూడదు. పాదాల కింద బట్టను ఉంచి పసుపు రాసుకుని ఆ బట్టను జాగ్రత్తగా తీయాలి. పసుపును కింద పడకుండా పాదాలకు రాసుకోవాలి. ఏదైనా కూడా జాగ్రత్త వహిస్తూ శ్రద్ధగా చేయాలి. అదేవిధంగా ఏ రోజు వాడే పసుపును ఆ రోజే కలుపుకోవాలి. ముందు రోజు కలిపిన పసుపును పాదాలకు రాసుకోవడానికి ఉపయోగించకూడదు. తెలిసి తెలియక ఎలా పడితే అలా పాదాలకు పసుపు రాసుకుని లేని అరిష్టాన్ని కొని తెచ్చుకోవద్దని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పాదాలకు పసుపు రాసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.