Rava Kesari : రవ్వ కేసరి స్వీట్‌ను సహజంగానే ప్రసాదం రూపంలో తింటుంటారు. దీన్ని ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల సమయంలో ప్రసాదంగా పంచి పెడతారు. అయితే వాస్తవానికి ఈ స్వీట్‌ను మనం ఇంట్లో కూడా ఎప్పుడు కావాలంటే.. అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. చాలా తక్కువ సమయంలోనే ఇది తయారవుతుంది. ఇక రవ్వ కేసరి స్వీట్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ కేసరి స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రవ్వ – 100 గ్రా., పాలు – అర లీటరు, చక్కెర – పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ – 100 గ్రా., యాలకుల పొడి – పావు టీస్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, గుమ్మడి గింజలు – ఒక టీస్పూన్.
రవ్వ కేసరిని తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేసుకోవాలి. అవి వేడి అయ్యేలోపు పక్కన కడాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ను వేయించి పక్కన పెట్టాలి. అదే కడాయిలో రవ్వ వేసి కాస్త రంగు మారే వరకు వేయించాలి. ఈ రవ్వను మరుగుతున్న పాలల్లో పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పది నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ఇందులో చక్కెర, యాలకుల పొడి వేసి కలుపాలి. మరో రెండు నిమిషాలు ఉంచిన తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు వేసి కలపాలి. 1 నిమిషం అయ్యాక దించేయాలి. దీంతో టేస్టీ రవ్వ కేసరి రెడీ అవుతుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు.