Water Apple Crop : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఉద్యోగాలు రావడం మరీ గగనం అయిపోతోంది. అందుకనే చాలా మంది స్వయం ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇక వ్యవసాయం చేయడం అన్నది కూడా అందులో ఒక భాగం అయింది. అయితే అందరూ వేసే పంటలు కాకుండా ఇతర ఏవైనా పంటలు వేస్తే.. అధిక మొత్తంలో ఆదాయం సంపాదిచేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి పంటల్లో వాటర్ యాపిల్ కూడా ఒకటి. ఇవి మనకు ఇప్పుడిప్పుడే బయట మార్కెట్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇవి ఎక్కడో విదేశాల్లో పండుతాయి.. అనుకుంటే పొరపాటు పడినట్లే. ఇవి మన దగ్గర కూడా పండుతాయి. ఈ క్రమంలోనే వీటిని పండిస్తే ఏటా లక్షల రూపాయలను ఆర్జించవచ్చు.
వాటర్ యాపిల్ పండ్లను సాగు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఎంత చిన్న స్థలం ఉన్నా ఈ చెట్లను పెంచవచ్చు. మొదటి సారి ఈ చెట్లను పెంచేవారు 1 ఎకరం స్థలంలో పంటను వేయాలి. 1 ఎకరం స్థలంలో సుమారుగా 200 చెట్లను పెంచవచ్చు. ఇక ఈ మొక్కలను విక్రయించేవారు కూడా ఉన్నారు. రూ.100 చెల్లిస్తే ఒక మొక్క ఇస్తారు. 200 మొక్కలకు రూ.20వేలు అవుతుంది. ఇక సొంత స్థలం అయితే పెట్టుబడి ఖర్చు ఉండదు. అలాగే ఈ మొక్కలను పెంచేందుకు ఎలాంటి రసాయన ఎరువులను వాడాల్సిన పనిలేదు. పశువుల ఎరువు చాలు. అది కూడా కొద్ది మొత్తంలో సరిపోతుంది. అంటే.. ఈ చెట్లను పెంచేందుకు పెట్టుబడి చాలా తక్కువగా అవుతుందన్నమాట.
ఇక ఈ మొక్కలు నాటిన 2వ సంవత్సరం నుంచి పంటకు వస్తాయి. కానీ 3వ సంవత్సరం నుంచి పండ్లను తీసుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ క్రమంలో 3వ ఏడాది ఒక చెట్టుకు 20 కేజీల పంట వస్తుంది. 4వ ఏడాది అయితే 50 కిలోలు, 5వ ఏడాది నుంచి ఒక చెట్టుకు ఏకంగా 100 కిలోల వరకు పంటను తీయవచ్చు. ఇలా లెక్క వేస్తే మొత్తం 200 చెట్లకు 20వేల కిలోల వరకు పంట వస్తుంది. ఇక మార్కెట్‌లో ఈ పంటకు కిలో ధర సరాసరి రూ.70 వరకు ఉంది. క్వాలిటీగా పండ్లు ఉంటే రూ.100 కు కిలో కూడా అమ్మవచ్చు. ఈ క్రమంలో 20వేల కిలోలకు రూ.14లక్షల మేర ఆదాయం వస్తుంది. వాటిలో ఖర్చులు రూ.4 లక్షలు తీసేసినా ఎంత లేదన్నా ఏడాదికి రూ.10 లక్షలు సంపాదించవచ్చు. ఇలా వాటర్ యాపిల్ పండ్ల సాగు ఎంతో లాభసాటిగా ఉంటుంది.
అయితే ఈ పండ్లను మార్కెటింగ్ చేయగలగాలి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండే సూపర్ మార్కెట్లతోపాటు ఎగ్జోటిక్ ఫ్రూట్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుంటే.. పంటను నిరంతరాయంగా సరఫరా చేయవచ్చు. దీంతో ప్రతి ఏడాది లక్షల రూపాయల లాభం వస్తుంది. ఈ పంట ప్రతి ఏడాది వేసవిలో చేతికి వస్తుంది. మిగిలిన సమయంలో చెట్లకు పశువుల ఎరువు, నీళ్లను పెడితే చాలు. ఈ పంటకు పెద్దగా నిర్వహణ కూడా అవసరం లేదు. ఇలా వాటర్ యాపిల్స్‌ను సాగు చేయడం వల్ల పెద్దగా కష్టపడకుండానే.. ఎక్కువ పెట్టుబడి అవసరం లేకుండానే.. లక్షల రూపాయలను సంపాదించుకోవచ్చు. ఇది ఎంతో లాభసాటిగా ఉంటుంది.