Cream : మనలో చాలా మంది కేక్ ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. మనకు వివిధ రుచుల్లో కేక్ లభిస్తూ ఉంటుంది. అలాగే చాలా మంది కేక్ ను ఇంట్లో కూడా రుచిగా తయారు చేస్తూ ఉంటారు. కేక్ తోపాటు కేక్ ను డెకరేట్ చేసే క్రీమ్ ను కూడా మనం ఇంట్లో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. కోడి గుడ్లను ఉపయోగించకుండా ఈ క్రీమ్ ను మనం తయారు చేయవచ్చు. ఇంట్లో సులభంగా కేక్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేక్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
వెన్న – 100 గ్రా., పంచదార – అర కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – 3 టేబుల్ స్పూన్స్.
కేక్ క్రీమ్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పంచదారను, కార్న్ ఫ్లోర్ ను వేసి మెత్తని పొడిలా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో వెన్నను వేయాలి. వెన్న మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత ఈ వెన్నను బీటర్ సహాయంతో 5 నిమిషాల పాటు మెత్తగా చేసుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని కొద్ది కొద్దిగా వేస్తూ మరలా బీటర్ తో మెత్తగా చేసుకోవాలి. పంచదార పొడి వేసిన తరువాత క్రీమ్ కొద్దిగా అవుతుంది.
ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలను పోస్తూ మరలా బీటర్ తో మెత్తగా చేసుకోవాలి. ఇలా కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు చేయడం వల్ల మెత్తగా ఉండే కేక్ క్రీమ్ తయారవుతంది. ఇలా తయారు చేసుకున్న కేక్ క్రీమ్ ను ఫ్రిజ్ లో ఉంచి కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకునే కేక్ క్రీమ్ లో వెనీలా ఎసెన్స్ ను కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు. బీటర్ అందుబాటులో లేని వారు విస్కర్ తో, స్పూన్ తో కూడా ఇలా క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. ఇవే కాకుండా మిక్సీ జార్ లో వేసినా కూడా మనం ఈ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లో కేక్ లను తయారు చేసినప్పుడు వాటిని ఇలా తయారు చేసిన క్రీమ్ తో గార్నిష్ చేసి తినడం వల్ల కేక్ రుచి మరింత పెరుగుతుంది.